Latest Posts

అనంతపురంలో “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభం: 21 కేటగిరీల దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

అనంతపురం జిల్లా

“దివ్యాంగ శక్తి”కి శ్రీకారం

దివ్యాంగ శక్తి కింద 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

74 శాతం ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరం.. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

కడప రీజనల్ పరిధిలో 18790మందికి లబ్ది, 18లక్షల 79వేల రూపాయల విధులు విడుదల

అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం “దివ్యాంగ శక్తి” (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దివ్యాంగ శక్తి ప్రారంభ కార్యక్రమంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టిసి జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు,, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ గారు, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ ఎం.కేశవరెడ్డి గారు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సును జిల్లా కలెక్టర్, ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఎమ్మెల్యేలు తదితరులు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు దివ్యాంగులతో కలిసి ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పోస్టర్లను ఆవిష్కరించారు. దివ్యాంగ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పూల నాగరాజు గారు మాట్లాడుతూ దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఈరోజు నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగుల ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా దివ్యాంగ శక్తిని ప్రారంభించడం జరిగిందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా స్థాయిలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించమన్నారు. కడప ఆర్టీసీ రీజనల్ పరిధిలో 18790 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వాటి కోసం 18 లక్షల 79,000 నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. గతంలో కేవలం 4 రకాల వైకల్యాలు ఉన్న దివ్యాంగులకు మాత్రమే రాయితీలు ఉండేవని, కానీ ఇప్పుడు ఈ సంఖ్యను 21 కేటగిరీలకు పెంచారన్నారు. 21 కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాల్లో భాగంగా, ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా అమలువుతోందని, దీనికి కొనసాగింపుగా, దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం అవుతోందన్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరూ ఈ పథకానికి అర్హులు అని, గతంలో దివ్యాంగులకు టికెట్ ధరలో 25 శాతం నుండి 40 శాతం వరకు రాయితీ ఉండేదని, కానీ ఇప్పుడు 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడిందన్నారు. ఈ పథకం ద్వారా అనంతపురం జోన్ పరిధిలో సుమారు 16,000 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్వీర్యం అయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, ప్రయాణ సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

Posted Under AP
Editor