యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ విడుదల తేదీని చిత్రబృందం ఒక రోజు ముందుకు జరిపింది. తొలుత ఈ సినిమాను ఫిబ్రవరి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అదే రోజు విడుదల కావాల్సిన శ్రీవిష్ణు మరో చిత్రం ‘మృత్యుంజయ’ అనివార్య కారణాలతో వాయిదా పడటంతో, ఆ ఖాళీని భర్తీ చేస్తూ ‘విష్ణు విన్యాసం’ను ఫిబ్రవరి 27, శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. దీనివల్ల సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ విడుదల తేదీ మార్పుపై హీరో శ్రీవిష్ణు తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. “ఈ ఫిబ్రవరి 27 నుంచి మీ జాతకంలో ‘నాన్-స్టాప్ ఫన్ దోషం’ మొదలవుతుంది” అంటూ సరదాగా పోస్ట్ పెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఇందులో శ్రీవిష్ణు మూఢనమ్మకాలు, జాతకాలను విపరీతంగా నమ్మే ఒక వెరైటీ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సత్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, మురళీ శర్మ వంటి హేమాహేమీలు నటిస్తుండటం విశేషం. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 25నే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. శ్రీవిష్ణు నుంచి రాబోతున్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
