రియల్ ఎస్టేట్ కింగ్ ఆఫర్: భర్తను వదిలేస్తే రూ. 25 కోట్లు! అమెరికాలో సంచలన లా సూట్

అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం తమిర్ పోలెగ్ ఒక వివాదాస్పద కేసులో చిక్కుకున్నారు. తన వద్ద పనిచేస్తున్న పైజ్ స్టెక్లింగ్ అనే మహిళను ఆమె భర్త నుంచి విడదీయడానికి దాదాపు 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) విలువైన ఆఫర్లు ఇచ్చారనే ఆరోపణలతో ఆమె భర్త మైఖేల్ స్టెక్లింగ్ కోర్టులో లా సూట్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా భారీ నగదు, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ ట్రిప్స్ ఆఫర్ చేసి తన భార్యను లోబర్చుకోవాలని పోలెగ్ ప్రయత్నించారని మైఖేల్ ఆరోపిస్తున్నారు.

ఈ కేసు వివరాల ప్రకారం, జనవరి 2025లో పోలెగ్… పైజ్‌కు యూటాలోని పార్క్ సిటీలో 1.5 మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు ఆఫర్ చేశారని, భర్తకు విడాకులు ఇస్తే ఆమె బాధ్యతలన్నీ తనే చూసుకుంటానని హామీ ఇచ్చారని సమాచారం. ఇందుకోసం ఆయన తన కంపెనీ స్టాక్స్‌ను అమ్మి 6 లక్షల డాలర్లను సిద్ధం చేశారని, ఆ డబ్బును ఇన్స్టాల్‌మెంట్లలో ఎలా తీసుకోవాలో ఆమెకు ఈమెయిల్ కూడా చేశారని మైఖేల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పైజ్ ఫిబ్రవరి 2025లో తన భర్తకు విడాకుల నోటీసులు ఇచ్చింది.

అయితే, ఈ ఆరోపణలను తమిర్ పోలెగ్ తీవ్రంగా ఖండించారు. పైజ్ తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని తనకు చెప్పిందని, ఆమె అడిగిన ఆర్థిక సాయం కోసమే తాను ఈమెయిల్ పంపానని వివరణ ఇచ్చారు. వారి మధ్య ఎలాంటి శృంగారపరమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పైజ్ కూడా తన విడాకులకు వ్యక్తిగత కారణాలే తప్ప ఈ ఆఫర్లు కావని చెబుతోంది. అయినప్పటికీ, తన సంసారాన్ని కూల్చినందుకు గాను పోలెగ్ నుంచి 5 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని మైఖేల్ కోర్టును ఆశ్రయించారు.

Editor