అబ్బాస్ రీ-ఎంట్రీ అదిరింది: ‘హ్యాపీ రాజ్’ ప్రోమో విడుదల.. తండ్రి పాత్రలో లవర్ బాయ్!

తెలుగు, తమిళ ప్రేక్షకులకు ‘ప్రేమదేశం’, ‘రాజా’, ‘నరసింహ’ వంటి చిత్రాలతో సుపరిచితుడైన నటుడు అబ్బాస్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి విదేశాల్లో స్థిరపడిన ఆయన, దాదాపు 12 ఏళ్ల తర్వాత ‘హ్యాపీ రాజ్’ అనే చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తమిళ హీరో, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అబ్బాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

తాజాగా విడుదలైన ‘హ్యాపీ రాజ్’ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అబ్బాస్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియకు తండ్రిగా నటిస్తున్నారు. ప్రోమో చూస్తుంటే ఆయన పాత్ర కామెడీ మరియు ఎమోషన్ కలగలిసిన ఒక రఫ్ అండ్ సాఫ్ట్ తండ్రి పాత్ర అని అర్థమవుతోంది. ఇన్నేళ్లయినా అబ్బాస్ తన మునుపటి చార్మ్ తగ్గకుండా ఉండటం చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం ఒక యువ జంట ప్రేమ, వారి పెళ్లి ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే సరదా గొడవల నేపథ్యంలో సాగే పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అబ్బాస్ వంటి నటుడు మళ్ళీ వెండితెరపై కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Editor