శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల పరిధిలోని తలమర్ల గ్రామంలో ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మహిళా చేయూత” కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ శిక్షణలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కుట్టు పనిలో మెళకువలు నేర్చుకున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 35 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసినట్లుగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మౌనిక డిక్షన్ సమక్షంలో, ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. శిక్షణ పొందిన మహిళలు తమ నైపుణ్యంతో సొంతంగా ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
మహిళా సాధికారతకు బాటలు వేస్తూ ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న సెక్రటరీ ప్రభాకర్ రెడ్డికి మరియు ఇతర నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరియు శిక్షణ పొందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
