ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు: 2027 మార్చిలో బాక్సాఫీస్ వేట మొదలు!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన భారీ అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అందించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ‘యానిమల్’ వంటి భారీ విజయం తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా విడుదల తేదీ వెనుక మేకర్స్ గట్టి వ్యూహాన్నే అమలు చేసినట్లు కనిపిస్తోంది. 2027 మార్చి 6న మహా శివరాత్రి పండుగ ఉండటంతో ఆ ముందు రోజే సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఆ వెంటనే ఆదివారం, ఆపై మార్చి 10న రంజాన్ సెలవులు ఉండటంతో మొదటి వారంలోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది.

‘స్పిరిట్’ కేవలం పాన్ ఇండియా స్థాయికే పరిమితం కాకుండా, గ్లోబల్ లెవల్‌లో సందడి చేయనుంది. తెలుగు, హిందీ, తమిళం వంటి భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రోమోలు సోషల్ మీడియాను షేక్ చేయగా, సినిమా విడుదల తేదీ ప్రకటనతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన విశ్వరూపం చూపించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Editor