శ్రీదేవి ‘థండర్ థైస్’ వ్యాఖ్యలు మళ్లీ సమర్థించుకున్న రామ్ గోపాల్ వర్మ: ‘ఆబ్జెక్టిఫికేషన్‌లో తప్పేమిటి?’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి తన పాత వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వార్తల్లో నిలిచారు. దివంగత నటి శ్రీదేవి స్టార్‌డమ్ సాధించడంలో ఆమె నటనతో పాటు ఆమె “థండర్ థైస్” (తొడలు) కూడా కీలక పాత్ర పోషించాయని దశాబ్దం క్రితం చేసిన వ్యాఖ్యలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో గట్టిగా సమర్థించుకున్నారు. ఒకరిని వస్తువులా చూడటం (Objectification)లో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

వర్మ తన అభిప్రాయాన్ని వివరిస్తూ, “ఆబ్జెక్టిఫికేషన్‌లో తప్పు లేదు. ఆమెలోని నటనతో పాటు అది కూడా ఒక ఆస్తి. శ్రీదేవి కాళ్లు సన్నగా ఉండి ఉంటే, ఆమె అంత పెద్ద స్టార్ అయ్యేవారని నేను అనుకోను. అవి ఆమె సక్సెస్ ప్యాకేజీలో ఒక భాగం” అని అన్నారు. అంతేకాకుండా, అమితాబ్ బచ్చన్ ఎత్తులాగే, శ్రీదేవి తొడలు కూడా ఆమె స్టార్‌డమ్‌లో భాగమని పోల్చారు.

వాస్తవానికి, 2015లో వర్మ రాసిన ‘గన్స్ అండ్ థైస్’ పుస్తకంలో శ్రీదేవి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ సమయంలో కూడా వర్మ తన వ్యాఖ్యలను సమర్థించుకోగా, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆయనను ‘సైకో’ అని విమర్శించారు. అయితే, ఆ వ్యాఖ్యలను తాను చిన్న వయసులో శ్రీదేవిని చూసిన దృష్టితో సరదాగా చేశానని వర్మ తాజా ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.

Editor