Latest Posts

‘నో కింగ్స్’ నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా: ట్రంప్ నిర్ణయాలపై ప్రజాగ్రహం

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు కలిగేలా అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వదేశంలోనే అమెరికా వాసుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా ప్రారంభమైన నిరసనలు, అక్టోబర్ 19వ తేదీన అమెరికాలో దాదాపు 2500 ప్రాంతాల్లో ‘నో కింగ్స్’ (రాజులు లేరు) పేరుతో దేశవ్యాప్తంగా మిన్నంటాయి. లక్షలాది ప్రజలు, సంస్థలు మరియు డెమోక్రాట్‌లు రోడ్లెక్కి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, హ్యూస్టన్ వంటి 50 రాష్ట్రాల్లోని నగరాల్లో “రాజులు లేరు, చక్రవర్తులు లేరు” అంటూ నినదిస్తూ, అమెరికా రాజ్యాంగం ప్రకారం పాలన అందించాలని, నిరంకుశ పాలన సహించబోమని నిరసనకారులు స్పష్టం చేశారు.

ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వదేశంలో ఇంతటి ఉధృతమైన తిరుగుబాటు తేవడానికి ప్రధాన కారణం, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో రకరకాల ఉత్తర్వులు జారీ చేసి పాలనను అస్తవ్యస్తం చేయడమే. ముఖ్యంగా గత మూడు వారాలుగా అమెరికాలో ‘షట్‌డౌన్’ ప్రారంభం కావడం వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, వలసలపై కఠిన నిర్ణయాలు, ప్రఖ్యాత యూనివర్సిటీలకు నిధులు నిలుపుదల చేయడం, విద్యాశాఖలో మార్పులు, ఉద్యోగాల కోత వంటి అనేక నిర్ణయాలు ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. ఈ నిరసనలు జెన్ జెడ్ తరహాలో ఉధృతమవుతుండటం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.

ట్రంప్ తన నిర్ణయాల వల్ల స్వదేశంలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఈ స్వల్పకాలంలోనే భారీగా అసంతృప్తి పెంచుకోవడంతో, భవిష్యత్తులో అమెరికా పరిస్థితి ఏమిటి అనే భావనకు అందరూ వస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని ఫెడరల్ కోర్టు పేర్కొనడం, అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను బేఖాతరు చేయడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిధులు నిలుపుదల చేయడం, పర్యావరణ పరిరక్షణ చట్టాల నుంచి బయటకు రావడం వంటి నిర్ణయాలు ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, ఇటువంటి వైఖరితో తన డాలర్ ప్రాబల్యంతో పాటు భవిష్యత్తులో తన ప్రజాస్వామ్య వైభవాన్ని కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి.

Editor