Latest Posts

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేసీఆర్ నేరుగా ప్రచారం చేయరా? తెరవెనుక వ్యూహాలకే పరిమితమా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో, ప్రచారం ఊపందుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉన్నప్పటికీ, ఆయన నేరుగా ప్రచారంలో పాల్గొంటారా అనే సందేహం నెలకొంది. పార్టీలో ‘ఒకటి నుంచి పది దాకా కేసీఆర్’ ఉంటారని నేతలు చెబుతున్నప్పటికీ, ఉపఎన్నికల్లో ప్రచారం చేయడంపై ఆయనకు పెద్దగా ఆసక్తి లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతను కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయడం మానేశారు. పాలేరు, దుబ్బాక, హుజూరాబాద్ సహా చాలా స్థానాల్లో ఆయన నేరుగా ప్రచారం చేయలేదు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్క బహిరంగసభలో మాత్రమే ప్రసంగించారు. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పాల్గొనకుండా, తెర వెనుక రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ తెర వెనుక తన వ్యూహాలను అమలు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఇంఛార్జ్‌లతో గురువారం భేటీకానున్న కేసీఆర్ వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా బయటకు రాని కేసీఆర్, త్వరలో ‘బ్యాక్ విత్ బ్యాంగ్’ అన్నట్లుగా మొత్తం సీన్ మారిపోయేలా రోడ్డుపైకి రావాలని ప్లాన్ చేస్తోంది. అందుకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేయకపోయినా పెద్దగా నష్టం ఉండదని పార్టీ భావిస్తోంది.

Editor