ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కన్నుమూత..!

ప్రముఖ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కార గ్రహీత ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అమెరికాలో కనుమూసారు. వారి వయసు 78. గత కొంతకాలంగా వృద్దాప్య అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

 

గొప్ప తెలుగు కన్నడ విమర్శకుడిని కోల్పోయాం. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఉప కులపతిగా సేవలు అందించారు. మంచి రచయిత, అనువాదకులు, విమర్శకులు! అనంతపురం జిల్లా పరకల్లు అనే పల్లెలో జన్మించి విద్యావేత్తగా, బహుభాషావేత్తగా గుర్తింపు పొందారు! విమర్శకు ఒక పర్యాయ పేరుగా నిలిచారు! సమగ్ర సాహిత్య విద్యా అధ్యయనమే విమర్శ అని చాటి చెప్పారు. సమీక్ష చేయడమే విమర్శగా భావించే రోజుల్లో అసలు సిసలైన విమర్శ ఇలా ఉంటుందని, సమీక్ష వేరు విమర్శ వేరు అని తన రచనల ద్వారా చూపించారు. ఆయన అనువదించిన విషాద కామరూప విశేషంగా ఆకట్టుకుంది.

 

ఆచార్య గంగిశెట్టి లష్మినారాయణ గారు ఇవాళ ఉదయం అమెరికా లో కాలిఫోర్నియాలో తన కుమారుడు వంశీ స్వగృహం లో తుదిశ్వాస విడిచారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం తులనాత్మక అధ్యయన శాఖ అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన కేవలం ఆచార్యులే కాకుండా కవి, నాటక రచయత ప్రతిభావంతులైన అనువాదకులు. శ్రీ భైరప్ప గారు కన్నడం లో రచించిన “పర్వ” నవలను అత్యంత సమర్ధంగా తెలుగులోకి అనువదించారు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. ఇందిరా గోస్వామి హిందీలో రచించిన విషాద కామరూప నవలను తెలుగులోకి అనువదించారు. అమెరికాలో ఉంటూ సిరికోన సాహిత్య అకాడమి ఆన్ లైన్ లో సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ అనేక మంది కవులకు, రచయితలకు వేదిక కలిపిస్తూ వచ్చారు. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటు. సాహితీవేత్త, ఆత్మీయులు లక్ష్మీనారాయణ గంగిశెట్టి గారికి నివాళులు.

 

– డా. మహ్మద్ రఫీ

Posted Under AP
Editor