తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ తెలంగాణ ఏసీబీ షాకిచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు అక్రమాల విషయంలో జరుగుతున్న విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు పంపింది. ఈ నెల 6న విచారణకు కేటీఆర్ ను రావాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు కాకుండా హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న కేటీఆర్ కు ఏసీబీ విచారణ మాత్రం తప్పనిసరి కానుంది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అక్రమాలపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ ఆధారాలను కూడా సేకరించింది. అయితే కేటీఆర్ ను విచారణకు పిలవకముందే ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా తాత్కాలిక ఊరట పొందారు. కానీ ఇప్పుడు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని కేటీఆర్ ను ఏసీబీ కోరింది.
ఈ కేసులో గతంలో బీఆర్ఎస్ సర్కార్ లండన్ చెందిన ఫార్ములా ఈ-కార్ సంస్ధతో చేసుకున్న ఒప్పందంలో జరిగిన ఉల్లంఘనలపై ఏసీబీ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఒప్పందానికి ముందే బీఆర్ఎస్ సర్కార్ కారు రేస్ నిర్వహణకు మేనేజ్ మెంట్ కమిటీ ఏర్పాటు చేయడం, ఫార్ములా 9 సీజన్ నిర్వహణకు నిధుల విడుదలకు హెచ్ఎండీఏ అధికారి అరవింద్ కుమార్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి.
మరోవైపు ఇదే కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు సమన్లు పంపింది. దీంతో ఈ నెల 6న ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్..ఆ తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్ధితి. దీంతో కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరవుతారా లేక కోర్టును ఆశ్రయిస్తారా తేలాల్సి ఉంది. ఈ కేసులో ఏసీబీ సేకరించిన ఆధారాలను తీసుకుని ఈడీ విచారణ జరపాల్సి ఉంది. దీంతో ఏసీబీ విచారణ తర్వాత అవే ఆధారాలతో ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
