తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించి నేపథ్యంలో.. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్ లను తెరవాలని సీఎస్ తెలిపారు. లోతట్టు, వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ఉదృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు.
వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృదాలను పంపించగలమని తెలియచేశారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయితీ రాజ్ తదితర శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మాన్ హోల్ లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సోమవారం విద్యాలయాలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.
