జిల్లా కలెక్టర్ ఆదేశం
ఐసీడీఎస్ లో తక్షణ అమలు
– : లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు
– : ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు
– : లాంఛనంగా ప్రారంభించిన పీడీ డా.బీఎన్.శ్రీదేవి
అనంతపురం:
అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.. ప్రభుత్వ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో మహిళ ఉద్యోగులు, కార్మికులను లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని సంకల్పించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు.
ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి చొరవ.. :
– జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాలను ఐసీడీఎస్ పీడీ డా.బీఎన్.శ్రీదేవి తక్షణం అమలు చేశారు. తమ శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన ఫిర్యాదుల బాక్స్ ను పీడీ శ్రీదేవి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. కార్యాలయంలో గానీ, ప్రాజెక్ట్ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో లైంగిక వేధింపులకు గురయ్యే వారు తమ ఫిర్యాదులు రాసి, ఇక్కడి బాక్స్ లో వేయాలని కోరారు. అవసరమైతే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఆ తరువాత సమగ్ర విచారణ చేసి, లైంగిక వేధింపులకు గురి చేసే ఉద్యోగులు, కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నివేదికను కలెక్టర్, ఎస్పీకి సమర్పిస్తామని కూడా వివరించారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్లు ధనలక్ష్మి, బాబా నూరుద్దీన్, ఐసీపీఎస్ డీసీపీఓ మంజునాథ, డీవీసీ విభాగం సోషల్ కౌన్సెలర్ ఉమాదేవి, ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్రకళ, అవుట్ రీచ్ వర్కర్ వాల్మీకి రమాదేవి, డీవీసీ విభాగం గీత, చైల్డ్ లైన్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
