ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దించనుంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడకు చేరుకున్న జగన్‌పై వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆయన గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. ఆయన భద్రతను పెంచాలని ఆదేశించింది. జగన్ బస చేసే నైట్ క్యాంప్‌కు సీఐఎస్ఎఫ్‌తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం జగన్ బస చేస్తోన్న నైట్ క్యాంప్‌లకు ఆక్టోపస్ బలగాలు, పోలీసులను ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించనున్నారు. నేటి నుంచే ఈ బలగాలు వైఎస్ జగన్ నైట్ క్యాంప్ భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తోంది.
కాగా- గాయం కారణంగా విశ్రాంతి ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు జగన్. ఆదివారం బస్సుయాత్రకు విరామం ఇచ్చారు. నేడు యధాతథంగా బస్సు యాత్ర ఆరంభం కానుంది. ఈ ఉదయం 9 గంటలకు కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు.
అనంతరం జొన్నపాడు, జనార్ధణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
