లిక్కర్ స్కామ్ కేసులో అర్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. సివిల్ లైన్‌లోని తన నివాసంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.
రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరిగి కేజ్రీవాల్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయనకు శుక్రవారం ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఉదయం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్‌ను తరలిస్తారు. ఆయనను స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయనుంది.
కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
