Latest Posts

బెజవాడలో వైసీపీకి మరో షాక్..!

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీపై అసంతృప్తితో తాజాగా పార్టీని వీడారు. వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన రాజీనామాతో కృష్ణాజిల్లాలో టీడీపీ అంతా ఖాళీ అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే కేశినేని రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నా తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మినహా మరో నేత ఆయనతో కలిసి నడిచేందుకు ఇష్ట పడలేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

 

2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బొప్పన భవ కుమార్… ప్రస్తుతం వైసీపీ నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవకుమార్ ను టీడీపీ నేతలు సంప్రదించారు. దీంతో ఆయన కూడా చర్చలు మొదలుపెట్టారు. విషయం తెలిసిన కేశినేని నాని, తూర్పు ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆయనతో టచ్ లోకి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు.

 

కేశినేని శివనాథ్ (చిన్ని)తో కొన్ని రోజులుగా టచ్ లో ఉన్న బొప్పన భవకుమార్ ఇవాళ టీడీపీ నేత నారా లోకేష్ తో భేటీ అయ్యారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన భవ కుమార్.. అనంతరం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు సీటులో టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిన భవ కుమార్.. అప్పటి నుంచీ వైసీపీ నగర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు భవకుమార్ తో పాటు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సందెపు జగదీష్, మరికొందరు కార్పోరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

 

సోదరుడు కేశినేని నానితో జరుగుతున్న పోరులో టీడీపీ నేత కేశినేని చిన్నికి ఇది తొలి విజయంగా చెప్పవచ్చు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి తో కలిసి ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నాట్లు బొప్పన భవకుమార్ తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికి వైసీపీలో గౌరవం లేదని, వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడ వైసీపీ లో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందన్నారు. ఎవరి సొంత నిర్ణయాలు వారివి తప్పితే పార్టీలో గౌరవం లేదన్నారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ టీడీపీ నేతలకు సహాయకుడిగా ఉంటానన్నారు. అవకాశవాద రాజకీయాలు చేయటానికి తాను ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి టీడీపీలో చేరట్లేదన్నారు.

Posted Under AP
Editor