అంతన్నాడు.. ఇంతన్నాడే గంగ రాజు అనే పాట తెలుగు నాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయింది..! ఎందుకు అని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం ప్రశ్నించుకుని, విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది. గ్రేటర్ హైదరాబాద్ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ జిల్లా, రంగా రెడ్డి జిల్లా, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాల్లో GHMC విస్తరించి ఉంది. GHMC పరిధిలో కోటి 60 లక్షల జనాభా ఉంది. కోటి 60 లక్షల మందిలో 70 -80 లక్షల మంది ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు ఉంటారని అంచనా. వీరిలో అత్యధిక మంది బీఆర్‌ఎస్‌కే ఓటేశారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇదే తెలుస్తుంది. GHMC పరిధిలో 29 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 18 స్థానాల్లో కారు స్పీడ్‌కు ఎదురు లేకుండా పోయింది. MIM 7 స్థానాలను నిలబెట్టుకుంటే.. బీజేపీ గోషామహల్‌లో కాషాయ జెంగా ఎగరేసింది. కాంగ్రెస్ మాత్రం 3 స్థానాలకే గ్రేటర్‌లో పరిమితమైంది. 2018తో పోల్చుకుంటే ఇంత ప్రభుత్వ వ్యతిరేకతలో కూడా గులాబీలు కోల్పోయింది ఒక్క సీటు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వారు గులాబీ జెండాకు అండగా నిలబడటం వల్లనే కారు గ్రేటర్‌లో దూసుకుపోయిందని చెప్పొచ్చు.
తెలంగాణ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఖండించలేదని, కేటీఆర్ హైదరాబాద్‌లో ర్యాలీలకు అనుమతించలేదంటూ ఎల్లో గొట్టాల ముందు చంద్రబాబు సామాజిక వర్గీయులు రెచ్చిపోయి మాట్లాడారు. కేసీఆర్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటామంటూ చంద్రబాబు సామాజిక వర్గ మహిళలు చెలరేగిపోయి మాట్లాడారు. ఎల్లో మీడియా కూడా గ్రేటర్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టింది.
సెటిలర్స్‌ను రెచ్చగొట్టే పనిని భుజాన వేసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌తో గ్రేటర్‌లో సెటిలర్స్ రగిలిపోతున్నారంటూ ఎల్లో మీడియా వార్తా కథనాలు వండటమే కాదు, చర్చలు కూడా పెట్టింది. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులకు చంద్రబాబు ప్రతినిధి కాదు కదా..? హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ అందరూ టీడీపీ వారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకోవచ్చు కానీ..అది నిజం కాదు కదా..?
హైదరాబాద్‌లో ఉన్న 70 -80 లక్షల మంది సెటిలర్స్‌లో చంద్రబాబు సామాజికవర్గం వారు మహా ఉంటే 2 శాతం ఉంటారేమో..!! కానీ.. ఆ సామాజికవర్గం వారి చేతిలో అత్యంత బలమైన ఎల్లో మీడియా ఉంది.. ఆర్ధిక వనరులున్నాయి. ఈ రెండింటింతో సెటిలర్స్ మైండ్‌లోకి ఎల్లో వైరస్ ఎక్కించాలనే ప్రయత్నం విఫలమైంది. చంద్రబాబు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణా రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఇక్కడ కాపుల ఓట్లు 70 వేలు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు 40 వేలు ఉన్నాయి. కానీ..ఇక్కడ జనసేనకు వచ్చిన ఓట్లు 39 వేలు. అంటే.. కాపుల్లో సగం మంది కూడా జనసేనకు ఓటు వేయలేదు, కమ్మ సామాజికవర్గం వారు కాంగ్రెస్‌కు ఓటేశారని స్పష్టమవుతోంది. ఒక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్ధులు విజయ ఢంకా మోగించడం వెనుక సెటిలర్ల ఓట్లు కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలను రెండు విధాలుగా విభజించాలి. 1. తెలంగాణ రూరల్, సెమీ అర్బన్ ఫలితాలు 2. GHMC పరిథిలో ఫలితాలు. తెలంగాణ రూరల్ కాంగ్రెస్ తిరుగులేని విజయాలు సాధిస్తే.. సెమీ అర్బన్‌లో పరవాలేదనిపించింది. గ్రేటర్‌లో మాత్రం హస్తవాసి బాగోలేదని అనిపిస్తోంది. కేవలం 3 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది.
టీడీపీ మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితం అయ్యిందంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయాల కోసం విభజించి.. తమను, తమ భవిష్యత్తు తరాలను దెబ్బకొట్టిందనే భావన సెటిలర్ల మనసులోంచి ఇంకా తొలగిపోలేదు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌కు చంద్రబాబు, ఎల్లో మీడియా మద్దతు పలకడాన్ని సెటిలర్స్ జీర్ణించుకోలేకపోయారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో కుల పాలన సాగించి, ఏపీని దోచుకున్నారని అత్యధికమంది సెటిలర్స్ నమ్మడం.. ఇవన్నీ కాంగ్రెస్‌కు ఓటేయ్యకుండా సెటిలర్స్‌ను దూరం చేశాయని భావించాలి. ఇదే సమయంలో ఏపీలో జగన్ పాలనపై ఎల్లో మీడియా దుమ్మెత్తిపోయడం కూడా సెటిలర్స్‌కు ఏమాత్రం నచ్చలేదు అనుకోవాలి.
ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా సెటిలర్స్ నిలవడం వెనుక కూడా కొన్ని కారణాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ఆంధ్రా నుంచి వలస వచ్చినవారిని ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయలేదు. ఆంధ్రుల రక్షణకు బీఆర్‌ఎస్ అండగా నిలబడింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 90 శాతం మంది సెటిలర్స్ బీఆర్‌ఎస్‌ను ఓన్ చేసుకున్నారు. ఈ కారణాలు నేపథ్యంలోనే సెటిలర్స్ బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు.
ఆంధ్రాలో వారాహి వాహనం ఎక్కి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మీద నోటికొచ్చినట్లు మాట్లాడే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. పోటీ చేసిన 8 చోట్ల ఘోర పరాజయం చవి చూసింది. 7 చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. కొల్లాపూర్‌లో పోటీ చేసిన బర్రెలక్కకు 5698 ఓట్లు వస్తే.. కూకట్ పల్లి మినహా ఎక్కడా కూడా జనసేనకు 3 వేల ఓట్లు దాటలేదు. పవన్ కల్యాణ్ పైకి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లోపల కాంగ్రెస్ గెలుపును కోరుకున్నారు అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన నిజం.
2024 ఏపీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్రా ఓటర్లు ఒక స్పష్టమైన మెస్సేజ్ పంపించారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ ఏపీలో పాలన సాగే తీరు హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ ఆరా తీస్తుంటారు. పండగలు పబ్బాలకు వచ్చినప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్దిని, నాడు – నేడులో జరుగుతోన్న స్కూళ్లు, వైద్య రంగం అభివృద్దిని చూసి వెళ్తుంటారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనను జగన్‌మోహన్ రెడ్డి పాలనను బేరీజు వేసుకుంటారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎల్లో మీడియా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే.. చంద్రబాబు తన అభ్యర్థులను పోటీలో పెట్టకుండా కాంగ్రెస్ గెలుపుకు పరోక్ష సహకారం అందించారు.
తెలంగాణ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ నోరు మెదపక పోయినా.. ఆయన మనసులో ఏముందో హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ గమనించే ఎల్లో మీడియా, చంద్రబాబు మాయలో పడకుండా జాగ్రత్త పడ్డారని అనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉంది.. ఎన్నికలకు ముందే ఆంధ్ర ఓటర్ల నాడి గ్రేటర్ ఫలితాలతో తేలిపోయింది.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సెటిలర్ ఓటర్లు నమ్మలేదు. ఎల్లో మీడియా ఎంత రెచ్చగొట్టినా పచ్చ ఉచ్చులో పడలేదు.
చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సెటిలర్ ఓటర్లు నిష్పాక్షపాతంగా నిజాయితీ వైపు నిలబడి ఓటేశారు. ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందనే ఆనందం ఉండే ఉండొచ్చు కానీ.. గ్రేటర్ ఫలితాలు వారికి ఎట్టి పరిస్థితుల్లో మింగుడు పడవు.
