Latest Posts

ఈసారి మాత్రం బాధపెట్టకండి: ఈటల ఇలాకలో కేసీఆర్ తేల్చేశారు

కరీంనగర్: కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని.. రాయి ఏదో.. రత్నం ఏదో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

 

Advertisement

58 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అనుకున్నంత స్థాయిలో పరిణితి రాలేదని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. ప్రజల దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని చెప్పారు. అభ్యర్థుల గుణగణాలు ప్రజలు విచారించి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసమేనని స్పష్టం చేశరు. కాంగ్రెస్‌ హయాంలో సాగు, తాగునీటి, కరెంట్‌ కష్టాలు ఉండేవని ఆరోపించారు.

 

Advertisement

KCR hits out at congress and bjp in jammikunta brs public meeting

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని.. కానీ, ఒక్క వైద్య కాలేజీని కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా.. కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు వచ్చే నిధుల్లో రూ. 25 వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందని ఆరోపించారు.

 

రైతుబంధు రూ. 16 వేలు రావాలంటే హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారని. ఈసారి అలా జరగొద్దు అని కేసీఆర్ అన్నారు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి.. ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డికి ఓటు వేయండి.. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే ఏమొస్తదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఏమైనా నిధులు తెచ్చారా? అని నిలదీశారు.

 

మరోవైపు, కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్సేనని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969లో ఉద్యమకారులను కాంగ్రెస్‌ పిట్టల్లా కాల్చి చంపిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పింఛను ఉండేదన్నారు. దేశ చరిత్రలో వందల్లో ఉన్న పింఛన్‌ను వేలల్లోకి పెంచామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయన్నారు.

Editor