తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్క్రూటినీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. మంగళవారంతో నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. 119 నియోజకవర్గాల్లో 4 వేల 798 మంది నామినేషన్లు వేయగా 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా గజ్వేల్ నుంచి 114 మంది బరిలో ఉన్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో అభ్యర్థులు తగ్గే అవకాశం ఉంది.

 

Advertisement

నవంబర్15వ తేదీ బుధవారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. 15వ తేదీ సాయంత్రానికి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డికి విద్యా అర్హతకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఆయన 2014, 2018, 2023 సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వేరు వేరుగా ఇంటర్ కాలేజీలను పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అలాగే జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపినాథ్ కు సంబంధించి కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ వీరి నామినేషన్లు తిరస్కరణకు గురి కాలేదు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఇటు రాజేందర్ గజ్వేల్ నుంచే కాకుండా హుజురాబాద్ నుంచి కూడా బరిలో నిలిచారు. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్, కామారెడ్డి నుంచి పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి.

 

సీఎం కేసీఆర్ వరుస సభల్లో పాల్గొంటుండగా.. ఇటు రేవంత్ రెడ్డి, ఇటల, బండి సంజయ్ కూడా ప్రచార వేగం పెంచారు. నవంబర్ 30 ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు.

Editor