Latest Posts

సీఎం కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నేతల వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న లగ్జరీ బస్సును ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం తనిఖీ చేశారు.

 

Advertisement

ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు కొత్తగూడెంకు కేసీఆర్ వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న ‘ప్రగతిరథం బస్సు’ను ఈసీ అధికారులు పోలీసుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారులు, పోలీసు సిబ్బంది ప్రతి మూలను తనిఖీ చేశారు. బ్యాగులు, బుట్టలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే పెట్టెలను కూడా తెరిచి చూశారు. వాహనంలో ఉన్న టాయిలెట్స్ కూడా తనిఖీ చేశారు.

తనిఖీలు చేస్తుండగా సంబంధిత అధికారులు వీడియో రికార్డు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఆదివారం సీఎం కేసీఆర్ కొత్తగూడెం, ఖమ్మం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగంిచారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

మరోవైపు, ఇతర రాజకీయ ప్రముఖుల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం కామారెడ్డి వెళుతున్న సమయంలో ఆయన కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనాలను కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Editor