చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్

బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్..

నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత సేపూ నిరంతరాయంగా కార్యకలాపాలను కొనసాగించిన ప్రజ్ఞాన్ రోవర్ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లింది.

విక్రమ్ ల్యాండర్‌ పేలోడ్స్- చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు కూడా టర్న్ ఆఫ్ అయ్యాయి.

చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చంద్రుడి మీద ఒక రాత్రి సమయం అంటే భూమి మీద 14 రాత్రులతో సమానం. చంద్రుడిపై ఒక్క రాత్రి గడిచిపోవాలంటే భూమి మీద 14 రోజుల సమయం పడుతుందన్నమాట.

ఈ 14 రోజుల రాత్రి సమయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. చంద్రుడి ఈక్వేటర్ వద్ద చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ సమీపంలో మైనస్ 208 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు లేదు.

ఈ 14 రోజుల కాలం గడిచిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే సమయానికి ఈ రోవర్ మనుగడ కొనసాగించగలుగుతుందా? లేదా? అనేది సవాల్‌గా మారింది. ఫలితంగా- ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఈ నెల 22వ తేదీన మళ్లీ చందమామపై పగటి సమయం మొదలవుతుంది. అప్పటికీ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు సజావుగా ఉంటుందని ఇస్రో భావిస్తోంది.

కాగా- చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ తాజా ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ తీసిన ఫొటోలు ఇవి. చంద్రయాన్ 2లో భాగంగా పంపించిన ల్యాండర్ అక్కడ క్రాష్ ల్యాండింగ్‌కు గురయినప్పటికీ.. దీనికి చెందిన ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. జాబిల్లి కక్ష్యలో పరిభ్రమిస్తూ వస్తోంది.

ఈ ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ డ్యూయెల్- ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (డీఎఫ్ఎస్ఏఆర్) ఈ ఫొటోలను తీసింది. చందమామపై అలముకున్న కటిక చీకటిలో సన్నటి కాంతి రేఖలా మెరుస్తూ కనిపించింది విక్రమ్ ల్యాండర్ ఈ ఫొటోల్లో. ఈ నెల 6వ తేదీన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది.

సింథటిక్ అపెర్చర్ రాడార్‌కు చెందిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ ద్వారా వెలువడిన మైక్రోవేవ్‌ల ఆధారంగా ఈ ఫొటోలు తీసింది ఆర్బిటర్. ఎలాంటి కాంతి లేకపోయినప్పటికీ.. కటిక చీకటి ప్రదేశాలను కూడా ఈ రాడార్ ఫొటోలను తీయగలదు. తాను తీసిన వస్తువు ఎంత దూరంలో ఉందనే విషయాన్ని కూడా రాడార్ పసిగట్టగలదు. ఏ ప్లానెటరీ మిషన్‌లోనైనా అత్యుత్తమ రిజల్యూషన్ పోలారిమెట్రిక్ చిత్రాలను అందించే సామర్థ్యం ఈ డీఎఫ్ఎస్ఏఆర్‌కు ఉంది.

Editor