అనంతపురం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చెయ్యడానికి ముందే చాలా స్కెచ్ లు వేశారని, చంద్రబాబును అక్రమ మార్గంలో అరెస్టు చేశారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత ఆరోపించారు.
చంద్రబాబు అరెస్టు పై మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.
శనివారం వేకువ జామున రాయలసీమలోని నంద్యాల పట్టణంలోని ఆర్ కే కల్యాణపండపం ఆవరణంలోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టు చెయ్యడం అంత అవసరం ఏమి వచ్చిందని మాజీ మంత్రి పరిటాల సునీత సీఐడీ పోలీసులను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే సీఐడీ పోలీసు అధికారులు స్వామి భక్తిని చాటుకోవడానికి చంద్రబాబును అరెస్టు చేశారని పరిటాల సునీత ఆరోపించారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో కూడా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత శనివారం సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి సమీపంలోని సీకే పల్లి మండలంలోని ఎన్ఎస్ గేట్ లో రోడ్డు మీద కుర్చుని చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
చంద్రబాబును ఎప్పుడు ఎప్పుడు అరెస్టు చెయ్యాలా అంటూ జగన్ చాలాకాలంగా ఆలోచిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు ఇంతకాలం చేశారని పరిటాల సునీత ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల లండన్ కు వెళ్లారని, అక్కడే చంద్రబాబు అరెస్టుకు పక్కాప్లాన్ చేసి స్క్రిప్ట్ సిద్దం చేసి దానిని సీఐడీ పోలీసులకు అందించారని, దాని ప్రకారం మా నాయకుడు చంద్రబాబును అరెస్టు చేశారని పరిటాల సునీత ఆరోపించారు.
రోడ్డు మీద ధర్నా చేస్తున్న పరిటాల సునీతను సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేసి పోలీసు వాహనంలో తీసుకెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే, నిజంగా పోలీసుల దగ్గర సాక్షాలు ఉంటే, సీఐడీకి దమ్ము ఉంటే శుక్రవారం రాత్రి నంద్యాల బహిరంగ సభలోనే ఎందుకు చంద్రబాబును అరెస్టు చెయ్యలేదని, టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
