ఇప్పుడు మరోసారి పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది.

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది.

ఈ క్రమంలో రెండో విడతకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమీక్షలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 21వ తేదీన గ్రేటర్‌ పరిధిలోని 23 నియోజకవర్గాలకు చెందిన మరో 13,300 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు అంతకుముందుగానే అర్హులైన లబ్ధిదారులకు సంబంధించి డ్రా తీయనున్నారు.

మొదటి విడతలో మాదిరిగానే ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా డ్రా విధానాన్ని చేపట్టనున్నారు. దీంతో మానవ ప్రమేయం లేకుండా.. సాంకేతికంగా డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులకు సెప్టెంబర్ 21న డబుల్‌ బెడ్రూం ఇళ్లను అందించనున్నారు. పండుగ వాతావరణంలో డ్రాలో పేర్లు వచ్చిన 13,300 మంది నిరుపేదలకు గౌరవంగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాను అందజేయనున్నారు.

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి, నిరుపేదలకు అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 70వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. మిగిలిన వాటి పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిలో మొదటి విడతగా 11,700 ఇళ్లను పంపిణీ చేయగా.. ఈ నెల 21న మరో 13,300 మందికి అందించనున్నారు. ఇలా విడతల వారీగా లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు రానివారికి.. గృహలక్ష్మి

హైదరాబాద్ నగరంలో త్వరలోనే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగర ఎమ్మెల్యేలు సూచించిన మార్పులు-చేర్పులకు సీఎం కేసీఆర్‌ సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. నగరంలో ఖాళీ జాగా అనేది స్వల్పంగా ఉంటుంది. ముఖ్యంగా నిరుపేదలు తమకున్న 50-60 గజాల్లో కూడా రేకుల షెడ్డు వేసుకోవడం, చిన్నపాటి స్లాబు ఇంటిని కట్టుకుంటారు. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకం ద్వారా అలాంటి నిరుపేదలకు ప్రయోజనం కలిగేలా చూడాలని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు విన్నవించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వారి విజ్ఞప్తికి సూచనాప్రాయంగా సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దీంతో డబుల్‌ బెడ్రూం రాని ఇలాంటి పేదలకు గృహలక్ష్మి ద్వారా ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలకు కూడా పదివేల డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

Editor