‘గుంటూరు కారం’ నుంచి పూజాహెగ్డే తొలగింపు?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న గుంటూరు కారం చిత్రం నుంచి హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డేను తొలగించారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.

వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

గుంటూరు కారంలో నటించే సీనియర్ నటీనటులకు సంబంధించిన కాల్షీట్ల సమస్య ఎదురవుతోంది. గతంలో వీరు ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ జరగకుండా వాయిదా పడటంతో ఈ సమయంలో వారి డేట్లు ఖాళీగా లేవు. దీంతో అందరి కాల్షీట్ల కోసం దర్శకుడు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈనెల 12వ తేదీ నుంచి షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే అదికూడా జరగడంలేదని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు గాసిప్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తమన్ ను తీసేశారని, ఆయన స్థానంలో కోలీవుడ్ కు చెందిన అనిరుధ్ రవిచందర్ రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తమన్ స్పందించారు. కడుపు మంటగా ఉంటే అరటిపళ్లు తినాలని సూచించారు.

అలాగే మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. హీరోయిన్ పూజాహెగ్డే ను పక్కన పెట్టారని, ఆమెకు బదులుగా త్రిషను తీసుకోబోతున్నారంటున్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తపై పూజాహెగ్డే స్పందించకపోవడంతో అందరూ నిజమే అనుకుంటున్నారు. పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రధాన హీరోయిన్‌ను పక్కన పెట్టటానికి గల కారణమేంటో ఎవరికీ తెలియరాలేదు. తాజాగా బండ్ల గణేష్ అసలు సినిమా అయినా ఉందా? లేదంటే అటెక్కించేశావా? అంటూ త్రివిక్రమ్ పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. తాజాగా ఇది వైరల్ గా మారింది.

Posted Under AP
YES9 TV