ఏపీలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ మీడియట్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్దులకుసీఎం జగన్ ఇవాళ జగనన్న ఆణిముత్యాలు అవార్డుల్ని ప్రదానం చేశారు. వీరితో పాటు వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కూడా సన్మానించారు.
రాష్ట్రంలో చేపడుతున్న విద్యాసంస్కరణల వల్లే వీళ్లంతా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని టాపర్లుగా నిలిచినట్లు సీఎం జగన్ తెలిపారు.
పేదరికం వల్ల విద్యార్ధులు చదువులకు దూరం కాకూడదని ప్రభుత్వం నిర్ణయించడం వల్లే స్కూళ్ల రూపురేఖలు మార్చినట్లు సీఎం జగన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం కూడా జగనన్న గోరుముద్దగా మార్చి అందిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే సమయానికి జగనన్న విద్యాకానుక ఇచ్చామన్నారు. అలాగే నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి తెచ్చామన్నారు. తొలిసారిగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం తెలిపారు. అలాగే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్స్ కూడా ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
గతంలో క్లాస్ టీచర్లే ఉంటారా ఉండరా అన్న పరిస్దితి నుంచి ఇవాళ సబ్జెక్ట్ టీచర్లను పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏపీలో పేద విద్యార్ధులు అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా టోఫెల్ పరీక్షకు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లతో పోటీపడే పరిస్ధితి తెస్తున్నామన్నారు.
