ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ కోటా కింద వైద్యవిద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ కొయ్యల రూత్‌జాన్‌పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం 2023 నీట్ పీజీలో పొందిన మార్కుల ప్రకారం పిటిషనర్ డాక్టర్ కొయ్యల్ రూత్ జాన్ పాల్ అడ్మిషన్ పొందడానికి అర్హత ఉన్నా.. సీటు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ), రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే థర్డ్ జెండర్ వారి పట్ల దయతో కాకుండా వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఎస్సీ, ఓబీసీ కోటాలలో ప్రవేశాలు పొందిన చివరి అభ్యర్థులు నీట్ పీజీ-2023లో పొందిన మార్కుల వివరాలనూ సమర్పించాలని జాతీయ వైద్య కమిషన్‌కు ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

YES9 TV