తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కుతోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. రెండు రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది.
దీంతో, మరో మూడు రైళ్లను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఒక రైలు ప్రయాణానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ట్రయల్ రన్ కూడా పూర్తి చేసారు. ఈ వారంలోనే అధికారికంగా షెడ్యూల్ ప్రకటన రానుంది. ఈ నెలాఖరులో తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది.
మూడో వందేభారత్ సిద్దం: ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ కు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కోచ్ లు.. సీట్లను రెట్టింపు చేసారు. సికింద్రాబాద్ నుంచి నాగపూర్, కాచిగూడ – బెంగళూరు, విశాఖ – భువనేశ్వర్ వందేభారత్ రైళ్లు నడపాలని రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు అందాయి.
అందులో తొలిగా సికింద్రాబాద్ – నాగపూర్ వందేభారత్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 580 కిలో మీటర్ల ఆ మార్గంలో పలు రైళ్లు ప్రయాణానికి దాదపుగా 10 గంటల సమయం పడుతోంది. వందేభారత్ ను ప్రవేశ పెట్టటం ద్వారా దాదాపు నాలుగు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. సికింద్రాబాద్ నుంచి నాగపూర్ 6 గంటల్లోనే చేరుకోనుంది.
ఈ నెలాఖరులోగా ప్రారంభం: సికింద్రాబాద్ నుంచి నాగపూర్ రూటు మార్గంలో రైల్వే అధికారులు వందేభారత్ ట్రయిల్ రన్ విజయవంతంగా పూర్తి చేసారు. సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వెళ్లేందుకు వయా కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్, సిర్పూర్ స్టేషన్లలో రైలు హాల్టింగ్ కు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ట్రయిల్ రన్ సమయంలో ఏ స్టేషన్ లోనూ రైలు ఆపలేదు.
ఇప్పటికే సికింద్రాబాద్ – నాగపూర్ మార్గంలో 18 రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ 19వ రైలుగా అందుబాటులోకి రానుంది. ట్రయిల్ రన్ పూర్తి కావటంతో త్వరలోనే రైలు నిర్వహణ సమయం..రైలు నెంబర్..టికెట్ ధరలు ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోగా సికింద్రాబాద్ – నాగపూర్ వందేభారత్ ప్రారించేలా కసరత్తు జరుగుతోంది. ఈ రైలు అందుబాటులోకి రావటం ద్వారా హైదరాబాద్ – నాగపూర్ మధ్య తక్కువ సమయంలోనే గమ్యం చేరుకొనే అవకాశం ఉంది.
కొత్త రైళ్లపై కసరత్తు: ఈ రైలు తరువాత కాచిగూడ – బెంగళూరు, విశాఖ – భువనేశ్వర్ మధ్య వందేభారత్ రైళ్ల పైన కసరత్తు ప్రారంభం కానుంది. ఒడిశా ప్రభుత్వం నుంచి భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వరకు వందేభారత్ ఏర్పాటు పైన ప్రతిపాదనలు అందాయి. అయితే, దూరం ఎక్కువగా ఉండటంతో స్లీపర్ వందేభారత్ కోచ్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత సికింద్రాబాద్ వరకు నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు వందేభారత్ అందుబాటులో ఉండటంతో, ప్రస్తుతం విశాఖ – భువనేశ్వర్ మధ్య వందేభారత్ పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ రైలు ప్రారంభానికి సంబంధించి ట్రయిల్ రన్ పూర్తి చేసి..షెడ్యూల్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా హైదరాబాద్ – బెంగళూరు రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ ను త్వరలో అందుబాటు లోకి తీసుకొస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
