ఏపీకి వాతావరణశాఖ శుభవార్త

నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించివుంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తున ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండవని పేర్కొంది. ఒకటి రెండు ప్రాంతాల్లో గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది.

Posted Under AP
YES9 TV