విశాఖ రాజధాని కాకపోతే శ్రీకాకుళం జిల్లా ఎన్నటికీ అభివృద్ధి చెందదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఊరికే అనలేదు. జిల్లాలో ఇచ్చాపురం పట్టణంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో అంటే.
1929లో నిర్మించిన వంతెన నేడు కూలిపోయింది. ఎందుకంటే విశాఖ రాజధాని కాలేదు కనుక!
ఒడిశా, ఆంద్రా రాష్ట్రాలను కలుపుతూ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ వంతెన శిధిలావస్థకు చేరుకొందని, ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని, దానిపై నిత్యం రాకపోకలు సాగించే ఇచ్చాపురంవాసుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని కనుక దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని స్థానిక జనసేన నేతలు అధికారులను కోరుతూనే ఉన్నారు. కానీ విశాఖ రాజధాని అయితే కానీ శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి అభివృద్ధిపనులు చేయడం సాధ్యం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పదేపదే చెపుతున్నారు కనుక అధికారులు కూడా పట్టించుకోలేదు.
ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి ముచ్చటగా రెండోసారి సిఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి, రెండేళ్లలో శ్రీకాకుళంలో రాబోయే పోర్టుతో, మూడేళ్లలో భోగాపురంలో రాబోయే విమానాశ్రయంతో ఉత్తరాంద్ర జిల్లాల రూపురేఖలు ఏవిదంగా మారిపోబోతున్నాయో వర్ణించి వర్ణించి చెపుతున్నప్పుడే, అక్కడ బహుదా వంతెన, దానిపై గ్రానైట్ లోడుతో వెళ్తున్న భారీ ట్రక్కుతో సహా కూలిపోయింది.
అందుకు సిఎం జగన్మోహన్ రెడ్డిని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన విశాఖకు మకాం మార్చి, విశాఖ నగరాన్ని దాంతోపాటు ఉత్తరాంద్ర జిల్లాలని నభూతో నభవిష్యత్ అన్నట్లు అభివృద్ధి చేయాలని చాలా పట్టుదలగానే ఉన్నారు. కానీ విశాఖలో రాజధాని ఏర్పాటుకు న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నందున సిఎం జగన్ విశాఖకు రాలేకపోతున్నారు. ఆ కారణంగా ఉత్తరాంద్ర జిల్లాలో అభివృద్ధి జరుగక ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంతే!
అదృష్టవశాత్తు ఆ సమయంలో వంతెనపై మరో వాహనం లేకపోవడం, దిగువన నదిలో నీళ్ళు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ట్రక్ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై జనసేన ఆరోపణలను స్థానిక వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ పురాతన వంతెనపై నుంచి గ్రానైట్ లోడుతో ట్రక్కు వెళ్ళడం వలననే వంతెన కూలిపోయింది తప్ప శిధిలావస్థకు చేరడం వలన కాదని వాదిస్తున్నారు.
బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కూలిపోవడానికి కారణం అది శిధిలావస్థకు చేరుకోవడమే అని వేరే చెప్పక్కరలేదు. ఒడిశా-ఆంధ్రా రాష్ట్రాలను కలిపే అతి కీలకమైన వంతెన శిధిలావస్థకు చేరుకొందని జనసేన నేతలు పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వలననే అది కూలిపోతే వంతెన సామర్ధ్యానికి మించి ఓవర్ లోడుతో వాహనం వెళ్ళడం వలననే కూలిపోయిందని స్థానిక వైసీపీ నేతలు ఇన్‌స్టాంట్ సంజాయిషీ చెప్పేశారు. వారి సమయస్పూర్తిని మెచ్చుకోవలసిందే.
