రామ్.. పూరి జగన్నాధ్ లు చేసిన సినిమాలు చేసినట్లుగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని వారి కెరీర్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది.
దాంతో ఇద్దరు కూడా మళ్లీ కెరీర్ లో బిజీ అయ్యారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరు చేసిన సినిమాలు నిరాశ పర్చాయి.
ముఖ్యంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా దారుణంగా నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత పూరి కోలుకోలేనంతగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే రామ్ తో సినిమాను చేయాలనే నిర్ణయానికి పూరి జగన్నాధ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.. పూరి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరించబోతుందట.
