: దాయాది దేశం పాకిస్తాన్‌లో చికెన్ ధరలు (Chicken Price Pakistan 2023) ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది. అదే సమయంలో కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. చికెన్ ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాన్య ప్రజలు అయితే చికెన్ ఊసే ఎత్తడం లేదని పాకిస్తాన్ స్థానిక మీడియా సమా టీవీ పేర్కొంది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం సహా రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్ మరియు మరికొన్ని నగరాల్లో చికెన్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన లాహోర్‌లో కిలో కోడి మాంసం ధర రూ. 550-600 మధ్య ఉంది.
కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర రూ. 700-705గా కూడా ఉందట. పాక్ చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ చికెన్ ధరలు చూసి.. చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరల కారణంగా చికెన్‌ను తినలేకపోతున్నామని సామాన్యులు చెబుతున్నారు. కోళ్ల ఫీడ్ కొరత కారణంగా అనేక పౌల్ట్రీ వ్యాపారాలు మూసివేయడం వల్ల ఈ ధరలు పెరిగాయని సమా టీవీ పేర్కొంది. ప్రభుత్వం ప్రస్తుతం ఫీడ్ కొరతకు గల కారణాలను పరిశోధిస్తోంది. పెరుగుతున్న ధరల వల్ల ప్రభావితమైన వినియోగదారులకు ఉపశమనం కలిగించే మార్గాలను అన్వేషిస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. పౌల్ట్రీ సరఫరాకు అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత మరియు ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం లేకుండా, చికెన్ ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
