హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్ ఫార్ములా ఈ విజేతగా నిలవడం ఇది మూడోసారి. మొత్తం 32 ల్యాప్‌లలో జరిగిన ఈ రేస్‌లో జాన్ ఎరిక్ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ ముందుగా లక్ష్యానికి చేరుకున్నాడు. నెక్లెస్ రోడ్‌లో 2.8 కిలోమీటర్లతో ఏర్పాటు చేసిన ఈ స్ట్రీట్ సర్క్యూట్ రేసులో 22 మంది రేసర్లు పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ రేస్ కొనసాగింది.
జాగ్వర్ రేసర్లు ఒకరిఒకరు ఢీకొట్టడంతో రేసు మధ్యలో నుంచి నిష్క్రమించారు. విన్నర్స్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ రేసుకు హాజరైన ప్రముఖులు వీళ్లే… ఇండియాలో తొలిసారి జరిగిన ఫార్ములా ఈ రేసుకు పలువురు సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్ ఫార్ములా ఈ రేసును తిలకించారు. రామ్‌చరణ్, నాగార్జున, యశ్, నాగచైతన్య, అఖిల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు రేసుకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేటీఆర్, రామ్ మోహన్ నాయుడుతో పాటు పలువురు మంత్రులు ఈ రేసును వీక్షించారు.
