తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ప్రారంభమైన ఉచిత అల్పాహార పథకం క్షేత్రస్థాయిలో అద్భుతమైన సత్ఫలితాలనిస్తోంది. విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం ద్వారా వారి హాజరు శాతాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా ఆరోగ్యంలోనూ సానుకూల మార్పులు తీసుకొచ్చిందని ‘థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్’ నిర్వహించిన స్వతంత్ర సర్వేలో వెల్లడైంది. కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా హరే కృష్ణ మూమెంట్ (హెచ్కేఎం) చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకంపై ఉమ్మడి మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని పది మండలాల్లో 1,153 మంది విద్యార్థులు, 575 మంది తల్లిదండ్రులు, 176 మంది ఉపాధ్యాయుల నుంచి సమగ్ర అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను రూపొందించారు.
సర్వే నివేదిక ప్రకారం, అల్పాహార పథకం ప్రారంభమైన తర్వాత కేవలం 60 పాఠశాలల్లోనే కొత్తగా 1,525 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషం. పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహారాన్ని 99.9 శాతం మంది విద్యార్థులు రోజూ క్రమం తప్పకుండా తింటుండగా, గతంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తరగతులకు హాజరయ్యే వారి సంఖ్య 98.3 శాతం మేర తగ్గింది. గడచిన విద్యా సంవత్సరంతో పోల్చితే విద్యార్థుల సగటు హాజరు ఏకంగా 20 నుంచి 22 శాతం మేర పెరిగినట్లు తేలింది. అటు ఉపాధ్యాయులు సైతం పథకం నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, 97.7 శాతం పాఠశాలలకు నిర్ణీత సమయానికి వేడివేడిగా అల్పాహారం అందుతోందని స్పష్టం చేశారు.
అల్పాహార నాణ్యత, రుచిపై 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రశంసలు కురిపించగా, మెనూలో బోండా-చట్నీ, దోశలకు 95 శాతం మంది మద్దతు పలికారు; ఉప్మాకు మాత్రం 75 శాతం మాత్రమే స్పందన లభించడంతో పాటు అదనంగా వడలను చేర్చాలని విద్యార్థులు కోరారు. కొడంగల్ మోడల్ ఘన విజయం సాధించడంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న డిసెంబర్ 9 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్లను అందుబాటులోకి తెచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకలి బాధలు తప్పి చదువుపై పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
