ప్రెస్ నోట్
తేదీ: 27 నవంబర్ 2026
ప్రదేశం: కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా
*కదిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు, నాపై చేస్తున్న ఆరోపణలపై వాస్తవాలను కదిరి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ అధిష్ఠానం స్పష్టంగా తెలుసుకోవాలి. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని బలహీనపరుస్తున్న అసమర్థ నాయకత్వానికి ఈ ప్రకటన ద్వారా నేను సమాధానం ఇస్తున్నాను.*
1. పార్టీ పెద్దల ఆదేశాలతోనే నామినేషన్ — బీ-ఫామ్ ఇవ్వకుండా కుట్ర:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, CWC సభ్యులు శ్రీ రఘువీరా రెడ్డి గారు, శ్రీ తులసి రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోటా సత్యం గారు, మడకశిర మాజీ ఎమ్మెల్యే శ్రీ సుధాకర్ గారు, పెనుగొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కేటీ శ్రీధర్ గారు, కదిరి సీనియర్ నాయకులు, మాజీ టెంపుల్ చైర్మన్ శ్రీ శ్రీహరి ప్రసాద్ గారు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పీఎస్ అహ్మద్ హుస్సేన్ గారు, మాజీ రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు శ్రీ నచ్చు బాలకృష్ణ యాదవ్ గారు, సత్యసాయి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అష్రఫ్ గారు మరియు ఇతర పార్టీ పెద్దల ఆదేశాలతోనే మేము ముందుకు వెళ్లాము.
జిల్లా అధ్యక్షులు షానవాజ్ గారి ఇంటికి స్వయంగా వెళ్లి చర్చించిన తర్వాతే, కాంగ్రెస్ పార్టీ తరపున నా శ్రీమతి రామ శ్రీలక్ష్మి మఠం గారిని చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి నామినేషన్ వేయించడం జరిగింది. అధిష్ఠానం మాటను శిరసావహించే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము వ్యవహరించాము. కానీ, జిల్లా అధ్యక్షుడు షానవాజ్ గారు మాకు బీ-ఫామ్ ఇవ్వకుండా, మెహఫూజ్ సుల్తానా అనే బలహీనమైన అభ్యర్థికి బీ-ఫామ్ ఇచ్చి పార్టీ ప్రయోజనాలను దెబ్బతీశారు.
2. 2024 ఎన్నికల ఓట్లు ఏమయ్యాయి? ఒక్క కౌన్సిలర్‌ను కూడా నిలబెట్టలేని దుస్థితి: 2024లో జరిగిన నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 3,314 ఓట్లు (అందులో ఒక్క కదిరి పట్టణంలోనే 2,500 ఓట్లు) పోలయ్యాయి. అలాంటి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కదిరి పట్టణంలో, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 2024లో పోలైన ఓట్లలో కనీసం సగం ఓట్లు కూడా ఎందుకు పడలేదు? కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మెహఫూజ్ సుల్తానా కి కేవలం 300 పైచిలుకు ఓట్లు మాత్రమే పోలయ్యాయంటే దానికి కారణం ఎవరు?బీ-ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా, కూటమి నాయకులతో కుమ్మక్కయ్యి బలహీనమైన అభ్యర్థిని తెరపైకి తెచ్చి, తూతూ మంత్రంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించారు. అంతేకాకుండా, కదిరి మున్సిపాలిటీలోని 44 వార్డులకు గాను కనీసం పదిమంది కాదు కదా, ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ అభ్యర్థిని కూడా నిలబెట్టలేని దయనీయ స్థితికి పార్టీని తీసుకొచ్చారు. కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన సత్యసాయి జిల్లా అధ్యక్షుడు, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త, కదిరి పట్టణ అధ్యక్షుల అసమర్థత వల్లే కదిరిలో కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా బలహీనపడుతోంది.
3. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నాపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?గతంలో శ్రీ ఇనాయితుల్లా గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన సీనియర్ కార్యకర్తను నేను. కదిరి నియోజకవర్గంలో ఒక బాధ్యత గల వ్యాపారవేత్తగా, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నా గురించి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు షానవాజ్ గారు ఇంత దిగజారుడుతనంతో మాట్లాడడం సిగ్గుమాలిన చర్య.కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పడం అత్యంత హాస్యాస్పదం. ‘పార్టీలో లేని వ్యక్తిని మీరు ఎలా సస్పెండ్ చేస్తారు?’ అని విలేకరులు నిలదీసినప్పుడు సమాధానం చెప్పలేక తెల్ల మొకం వేసిన తీరును అందరూ చూశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారిపై ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం.
4. పార్టీ కోసం నా సేవలు అందరికీ తెలుసు:కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ బలోపేతం కోసం నేను ఏమి చేస్తున్నానో జిల్లాలోని కాంగ్రెస్ పెద్దలకు, నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసు. జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ర్యాలీలు మరియు కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా చేయడం జరిగింది. అలాగే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మరియు ఇతర సీనియర్ నేతలతో కలిసి పనిచేయడం, నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి నేతల స్మారక కార్యక్రమాలు నిర్వహించడం, గత జిల్లా అధ్యక్షుడు ఇనాయితుల్లా గారితో కలిసి కదిరి పార్టీ కార్యాలయంలో సమావేశాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసనలు చేపట్టడం వంటి అనేక కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాను.
అధిష్ఠానానికి విజ్ఞప్తి:
కనీసం లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ అభ్యర్థిని కూడా నిలబెట్టలేని అసమర్థులకు జిల్లా అధ్యక్ష పదవి, నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు, పట్టణ అధ్యక్షలకి పదవి అవసరమా అని ప్రశ్నిస్తున్నాను. తమ చేతగానితనానికి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ, పార్టీని బలహీనపరుస్తున్న ఇలాంటి అసమర్థులపై పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు అభ్యర్థులను కూడా నియోజకవర్గంలో పెట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని దిగజారుస్తున్న జిల్లా అధ్యక్షుడు మరియు నియోజకవర్గ సమన్వయకర్త షానవాజ్ గారిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు,
చిలమత్తూరు మోహన్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కదిరి.
