ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పార్టీ శ్రేణులపై ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆయన తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి వేళ తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏకంగా మంచం వేసుకుని నిరసనకు దిగారు. రహదారిపైనే పడుకుని నిరసన తెలపడంతో ఒక్కసారిగా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొడవండ్లపల్లి గ్రామాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై పథకం ప్రకారం దాడులకు తెగబడ్డారని జేసీ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వైసీపీ శ్రేణులపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. అర్ధరాత్రి నిరసన తీవ్రరూపం దాల్చడంతో డీఎస్పీ సహా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జేసీ నిరసనను విరమించారు.
మరోవైపు ఈ ఘటనా పరిణామాలపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జిల్లాలో పోలీసులు పూర్తి ఏకపక్షంగా, అధికార టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిబంధనలను పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇరు పార్టీల పరస్పర ఆరోపణలు, అర్ధరాత్రి ధర్నాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక సమరం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
