వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూటమి ప్రభుత్వం మరియు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి నాయకుల కళ్లల్లో రక్తం చూపిస్తానని, ఈ ప్రాంతంలో ఎవరూ వారి బెదిరింపులకు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. తనపై నమోదైన దాడి కేసు నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజకీయంగా తమను అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేస్తూ చేసిన వ్యాఖ్యలు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఈ వివాదం తూర్పు గోదావరి జిల్లా కోరంగి మండలం బుచ్చంపేట పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. అక్కడ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఉన్న అనపర్తి మణికంఠ.. టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. పార్టీ శ్రేణులకు, నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా మణికంఠ ఏకగ్రీవానికి అంగీకరించి వెన్నుపోటు పొడిచారనే ఆగ్రహంతో ఆయనపై దాడి చేశారంటూ పోలీసులు జక్కంపూడి రాజాపై కేసు నమోదు చేశారు. ఈ అంశంపై రాజా స్పందిస్తూ.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ద్రోహం చేయడంతో ఆవేశంలో అలా ప్రవర్తించానని అంగీకరిస్తూనే, జరిగిన తప్పును సరిదిద్దుకుంటానని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు తలొగ్గవద్దని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరు నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆయన మాటే తమకు శిరోధార్యమని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపకుండా, ప్రజాప్రతినిధి స్థానాన్ని బహిరంగంగా వేలం వేసిన టీడీపీ నాయకులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. తన నియోజకవర్గ పరిధిలోని సీట్లను అక్రమ వేలం ద్వారా అధికార టీడీపీకి దక్కనీయబోనని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
