తెలంగాణ సాగునీటి ప్రయోజనాలే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి బృందంతో కలిసి అర్థరాత్రి ముంబై చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు నీటిపారుదల రంగ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ బృందం నేడు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ద్వైపాక్షిక సమావేశం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సర్కారుతో చర్చలు జరిపేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ ఎత్తు పెంపు అంశంపై చర్చించనున్నారు. గతంలో నిర్ణయించిన 148 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని (FRL) 150 లేదా 152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే తెలంగాణ బృందం ప్రధాన అజెండాగా పెట్టుకుంది. బ్యారేజీ ఎత్తు పెంచడం ద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసి, తెలంగాణ రైతులకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రానికి ముంపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను తెలంగాణ ఇంజనీరింగ్ విభాగం ఈ భేటీలో సమర్పించనుంది.
ఉభయ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి అంశాలపై మహారాష్ట్ర వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ, సాగునీటి వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, ఫడణవీస్ మధ్య జరిగే ఈ ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిస్తే, తెలంగాణ సాగునీటి రంగంలో మరో కీలక ముందడుగు పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
