ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా కేంద్రంగా (Education Hub) తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను సమూలంగా పెంచడంతో పాటు, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రతిష్టాత్మక ప్రైవేట్ వర్సిటీలను ఏపీకి ఆకర్షించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నూతన విధానంలో భాగంగా 2027 డిసెంబరులోగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకునే అర్హత కలిగిన సంస్థలకు 50 ఎకరాల వరకు భూమిని కేటాయించడంతో పాటు స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు వంటి ఆకర్షణీయ ప్రోత్సాహకాలను అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాల విద్యను స్థానిక విద్యార్థులకు చేరువ చేయడంతో పాటు విద్యా రంగంలో భారీగా పెట్టుబడులను రాబట్టడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ విద్యా వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2029 నాటికి కనీసం 5 అంతర్జాతీయ విదేశీ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేలా చూడాలని, అదే సమయంలో 5,000 మందికి పైగా విదేశీ విద్యార్థులను ఏపీలోని విద్యాసంస్థల్లో చదువుకునేలా ఆకర్షించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల ఆగమనంతో అత్యాధునిక కోర్సులు, పరిశోధనా అవకాశాలు పెరిగి స్థానిక విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ దక్కే మార్గం సుగమమవుతుంది.
ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాల సాధన ద్వారా విద్యా రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన భారీ భూ కేటాయింపులు, రాయితీలు ప్రముఖ విదేశీ సంస్థలను ఏ మేరకు ఆకర్షిస్తాయన్నది కీలకం కానుండగా.. ఈ సరికొత్త విద్యా విధానం విజయవంతమైతే ఉన్నత విద్యా రంగ పటంలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
