Latest Posts

వర్షాల కోసం పిన్నదరి గ్రామస్థుల ప్రత్యేక ప్రార్థనలు…

తాడిమర్రి (Yes9tv )వర్షాల కోసం పిన్నదరి గ్రామస్థుల ప్రత్యేక ప్రార్థనలు
విరాటపర్వం పారాయణం – భజనలతో గ్రామాల మీదుగా పాదయాత్ర – వరుణదేవుడిని వేడుకున్న రైతులు
తాడిమర్రి మండలం, పిన్నదరి, జూలై 24:
వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ ప్రజలు శుక్రవారం వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీరామస్వామి దేవాలయంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు కలిసి విరాటపర్వం పారాయణం నిర్వహించి, వరుణదేవుడు కరుణించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులు భజనలు చేస్తూ గ్రామం నుంచి గుంజుపల్లి, నలిపిరెడ్డిపల్లి, కునుకుంట్ల, మద్దెల చెరువు, భీమారాయనపేట మీదుగా పాదయాత్ర నిర్వహించారు.
మార్గమంతా “గోవిందా”, “శ్రీరామ జయరామ” నామస్మరణతో భజనలు చేస్తూ వర్షాలు కురిసి ప్రజలకు, పశువులకు, పంటలకు సమృద్ధిగా నీరు అందాలని వేడుకున్నారు. సాయంత్రం తిరిగి పిన్నదరి గ్రామానికి చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
గ్రామ రైతులు మాట్లాడుతూ, ఇప్పటికే ఖరీఫ్ పంటలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయని, చెరువులు, కుంటలు, బోరుబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి మంచి వర్షాలు కురిపించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. గ్రామంలో ఐకమత్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగగా, వర్షాలు కురవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని వేడుకున్నారు.

Posted Under AP
Editor