తాడిమర్రి( yes9tv)దాడి తోట గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు
తాడిమర్రి, జూన్ 30: తాడిమర్రి మండల పరిధిలోని దాడి తోట గ్రామంలో మొహరం వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పీర్ల స్వాముల పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపారు.
గ్రామంలో ప్రసిద్ధి చెందిన పెద్ద కాసిం, చిన్న కాసిం, కేశమ్మ, నిమ్మకాయ పీర్లను ప్రత్యేకంగా అలంకరించి వేకువజామున గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఐదు రోజుల పాటు పీర్ల చావిడిలో పీర్ల స్వాములను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు చక్కెర పానకాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు సంప్రదాయబద్ధంగా అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం నిర్వహించి, అనంతరం మేళతాళాల నడుమ గ్రామ వీధుల్లో వైభవోపేతంగా ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యానికి ప్రతీకగా కలిసి రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా చిందులు వేశారు.
ఊరేగింపు అనంతరం జల్దీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మొహరం వేడుకలు మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
దాడి తోట గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు…
