నేమకల్‌లో టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. సామాన్య ప్రజలకు కన్నీళ్లు..

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మండలంలో నేమకల్ గ్రామం టీడీపీ నేతల ఇళ్లకు నీళ్లు.. ప్రజలకు కన్నీళ్లు మిగులుతున్నాయి. మండలంలోని నేమకల్లు గ్రామంలో అధికార బలంతో టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారు. తాగు నీటి అవసరాల కోసం వేసిన ప్రధాన పైప్‌లైన్‌కు కుళాయి కనెక్షన్ ఇచ్చుకుని తమ ఇళ్లలోని సంపులు నింపుకుంటూ ప్రజల అవసరాలకు గండికొడుతున్నారు.
నేమకల్లు పంచాయతీలో 1,300 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 5,000 జనాభా ఉంది. ప్రజలకు తాగునీటి అవసరాల కోసం చింతకుంట జలాశయం నుంచి రెండువారాలకోసారి కుళాయిలకు నీరు వదులుతున్నారు. అసలే నీరు అరకొరగా వస్తున్న సమయంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అధికారుల కళ్లు గప్పి ప్రధాన పైప్‌లైన్‌కు కుళాయి కనెక్షన్ ఇచ్చుకున్నారు.
దీంతో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమిటని అరా తీస్తే అనుమతులు తీసుకున్నామని బుకాయిస్తుండడంతో ప్రజలు చేసేదేమీ లేక సమీప వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన టీడీపీ నేతలే మౌలిక వసతులకు గండికొడుతుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Posted Under AP
Editor