కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం….ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి…

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో విషాదం: ఈతకు వెళ్ళి డిగ్రీ విద్యార్థి మృతి
ఆలూరు

సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనేకుర్తి గ్రామానికి చెందిన వీరేష్, శివమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉపేంద్ర (18) స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. కాగా, సోమవారం నాడు ఉపేంద్ర తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ఒక నీటి కుంటకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటి లోతును గమనించని ఉపేంద్ర ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు.

కాపాడటానికి ప్రయత్నించిన ఎస్ఐ.. అయినా దక్కని ఫలితం:
ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్నేహితులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఆలూరు ఎస్ఐ మన్మద విజయ్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన మనేకుర్తి గ్రామానికి చేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్ఐ స్వయంగా రంగంలోకి దిగి, స్థానికుల సహాయంతో ఉపేంద్రను నీటి కుంటలో నుంచి బయటకు తీశారు.
ఉపేంద్ర ప్రాణాలను కాపాడాలనే ఆరాటంతో ఎస్ఐ మన్మద విజయ్ అతనికి ప్రాథమిక చికిత్సగా (CPR) ఛాతిపై చేతులతో నొక్కుతూ శ్వాస అందించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఉపేంద్ర మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు:
మృతుడు ఉపేంద్ర తల్లిదండ్రులైన శివమ్మ, వీరేష్‌లకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి ఇప్పటికే వివాహం కాగా, చిన్న కుమారుడైన ఉపేంద్ర డిగ్రీ చదువుకుంటూ ఇంట్లో అందరికీ ఎంతో ఆసరాగా ఉండేవాడు. చేతికొచ్చిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మనేకుర్తి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Posted Under AP
Editor