ఆర్ డి టి సేవలను పునరుద్ధరించినందుకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థకు మళ్లీ కొత్త ఊపిరి లభించింది. గత 50 సంవత్సరాలుగా పేద పిల్లల విద్య, ఆరోగ్య సేవలు, నిరాశ్రయులకు గృహ నిర్మాణం వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి అండగా నిలిచిన ఈ సంస్థ, ఇటీవల మూడు సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) రెన్యువల్ ఆలస్యం కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ధర్మవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సహకారంతో ఈ సంస్థకు FCRA రెన్యువల్ మళ్లీ సాధ్యమైంది. దీంతో సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు , రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు నారాయణస్వామి, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దుల విజయసాగర్ మరియు బీజేపీ కార్యకర్తలు మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషితో వేలాది పేద కుటుంబాలకు మళ్లీ సేవలు అందే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
సంస్థ పునరుద్ధరణతో పేదల విద్య, ఆరోగ్య రంగాల్లో మళ్లీ అభివృద్ధి వేగం పెరుగుతుందని, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
