Latest Posts

రాయదుర్గంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం: సంక్షేమ శ్రేయో రాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

సంక్షేమ శ్రేయో రాజ్యమే కూటమి లక్ష్యం.

తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
రాయదుర్గం పట్టణంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు నిర్దేశించిన “దివ్యాంగ శక్తి” పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని స్థాపించాలని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారక రామారావు సంకల్పించారన్నారు. ఆయన సూచించిన అడుగుజాడల్లో కూటమి ప్రభుత్వం పయనిస్తూ, నేడు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని గత ఏడాది కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగశక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతోందన్నారు. సమాజంలో శారీరక ఇబ్బందులతో సతమతమవుతున్న దివ్యాంగ సోదర, సోదరీమణుల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమన్నారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా, తమ పనుల నిమిత్తం రాష్ట్రమంతా స్వేచ్ఛగా తిరిగేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం గొప్ప నిర్ణయమన్నారు. 40శాతం పైగా శారీరక లోపం కలిగిన దివ్యాంగులకు ఇది వర్తిస్తుందన్నారు. వారికి తోడుగా వెళ్లే సహాయకుడికి కూడా టికెట్ ధరలో 50% రాయితీ ఇవ్వడం ఈ పథకంలోని మానవీయ కోణాన్ని చూపిస్తోందన్నారు. గతంలో దివ్యాంగుల పింఛన్ రూ.3వేల నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.6వేలకు పెంచారన్నారు. ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకం ఒక గొప్ప వరమని భావిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో దివ్యాంగులను భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దివ్యాంగ సోదర, సోదరీమణులందరూ ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే అనంతరం బళ్లారి రోడ్డులోని సీతారామాంజనేయ కళ్యాణమంటపంలో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, బిజెపి నాయకులు అంబోజి రావ్, వసుంధర దేవి, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కరేగౌడ మంజునాథ, మాజీ డైరెక్టర్ టoకశాల హనుమంతు, పూజారి శివ, జీలాన్, కరెన్న,ఆగ్రహరం కిరణ్, గుద్దిటి లోకేష్, ఆనంద్, బుదురు తిప్పేస్వమి,వై.వెంకటేశులు,ఆటో వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor