తిరుపతి:
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
