చిత్తూరు:
పండుగల సమయంలో పరస్పర గౌరవం, సహనం పాటించినప్పుడే నిజమైన సామాజిక సౌహార్దత సాధ్యమవుతుందని చిత్తూరు ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా పేర్కొన్నారు. రానున్న ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో బుధవారం పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మతపెద్దలు, ప్రముఖులతో నిర్వహించిన ‘శాంతి కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సామాజిక మాధ్యమాల్లో వచ్చే అపోహలను, అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా లేదా సాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు ఎస్‌డీపీఓ టి. సాయినాథ్ మాట్లాడుతూ.. పండుగ ఊరేగింపులు, ప్రార్థనల సమయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని కోరారు. చిత్తూరు జిల్లా ఎప్పుడూ శాంతికి ప్రతీకగా నిలవాలని, మతపెద్దలందరూ ఐక్యతతో మెదలాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మహేశ్వర్, నెట్టికంఠయ్యతో పాటు వివిధ మతాలకు చెందిన పెద్దలు, బీజేపీ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. పండుగలను సోదరభావంతో నిర్వహించేందుకు తామంతా సహకరిస్తామని మతపెద్దలు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
