అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం
డి.హిరేహాల్ మండల పరిధిలోని గొడిశలపల్లి గ్రామంలో ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో అంబాపురం – గొడిసెలపల్లి మధ్య ఉన్న కురుబ తిమ్మప్పకు చెందిన తోటలో ఏర్పాటు చేసిన గుడిసెలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్న గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒక దూడ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
అగ్నిప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.
