Latest Posts

అసత్య ప్రచారాలను నమ్మవద్దు – భక్తులకు టిటిడి విజ్ఞప్తి

  • శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు
  • అసత్య ప్రచారాలను నమ్మవద్దు
  • – భక్తులకు టిటిడి విజ్ఞప్తి

తిరుమల:

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని తెలియజేస్తున్నాం .

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టిటిడి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమే. అయితే ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టిటిడి స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోంది.

ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని వెల్లడించింది.

అదేవిధంగా వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పేర్కొంది. లడ్డూ తయారీకి సంబంధించిన పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవాలు ఇలా ఉండగా టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు మరియు లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రజలు, భక్తులు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని టిటిడి మరోసారి స్పష్టం చేసింది.

Posted Under AP
Editor