Latest Posts

ఉరవకొండ CHCలో వైద్యం వికారం: రోగుల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

ఉరవకొండ CHCలో ‘వైద్యం’ వికారం: రోగులంటే అంటరానివారా? ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు!
ఉరవకొండ, మార్చి 3:
పేదవాడికి ప్రాణభిక్ష పెట్టాల్సిన ఉరవకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఇప్పుడు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అక్కడ పనిచేసే కొందరు డాక్టర్లు, సిబ్బంది తీరు చూస్తుంటే.. “రోగులు మనుషులు కారా?” అన్న అనుమానం కలగక మానదు. బాధ్యతను గాలికొదిలేసి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉరవకొండ ఆసుపత్రి దుస్థితిపై సామాన్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఫార్మసీ కౌంటరా? లేక సరిహద్దు గోడా?
ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఫార్మసీ కౌంటర్ వద్ద ఇప్పటికే గ్లాస్ పార్టిషన్లు ఉన్నా, రోగులు కనీసం దగ్గరకు రాకుండా క్లాత్‌లను అడ్డుగా కట్టడం సిబ్బంది అహంకారానికి నిదర్శనం. మందుల కోసం వచ్చే రోగులను ‘అంటరానివారిగా’ చూస్తూ, వారి పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు. “రోగం వస్తే మాస్కులు పెట్టుకోమని చెప్పండి, అంతే కానీ ఇలా క్లాత్‌లు అడ్డుపెట్టి మనుషులను అవమానిస్తారా?” అని బాధితులు ఫైర్ అవుతున్నారు.
ప్రైవేట్ క్లినిక్‌లపై ఉన్న ప్రేమ.. ప్రభుత్వ ఆసుపత్రిపై ఎందుకు లేదు?
ఉరవకొండ CHC డాక్టర్ల తీరు మరీ దారుణం. తమ ప్రైవేట్ క్లినిక్‌లలో కాసులు కురిపించే రోగుల దగ్గర వినయం ప్రదర్శించే ఈ వైద్యులకు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలపై కనీస కరుణ లేదు. కనీసం చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని రోగిని తాకడానికి కూడా వీరికి ఓపిక లేదు.
కళ్ళకు కట్టిన నిర్లక్ష్యం:
మంగళవారం ఉదయం 11:40 గంటలకు జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ఒక చిన్నారికి మూడు రోజులుగా దగ్గు, గొంతు నొప్పి అని తండ్రి ఓపీ తీసుకుని వెళ్తే, 4వ నంబర్ రూమ్ డాక్టరు కనీసం ఆ పాప నోరు తెరిచి గొంతు ఎలా ఉందో కూడా చూడలేదు. తండ్రి చెప్పిన మాటలకే ఏదో మొక్కుబడిగా మందులు రాశారు. పోనీ ఆ మందులైనా దొరుకుతాయా అంటే.. ఫార్మసీలో డాక్టర్ రాసిన మందులు కాకుండా వేరేవి ఇచ్చారు. “స్టాక్ లేవు.. ఇవే తీసుకోండి” అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. అసలు ఆసుపత్రిలో ఏ మందులు ఉన్నాయో కూడా తెలియని స్థితిలో డాక్టర్లు ఉన్నారంటే, వీరి పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారులారా.. నిద్ర లేవండి!
పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి బాధ్యతారాహిత్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యం కోసం వచ్చే రోగులను వేధించే ఫార్మసిస్టులు, విధులను విస్మరించి ప్రైవేట్ ప్రాక్టీసులపై మమకారం చూపే డాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి ఈ ఆసుపత్రిని ప్రక్షాళన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవు.

Posted Under AP
Editor