Latest Posts

ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్‌..

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్రమ వలసదారులకు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వార్నింగ్‌ ఇస్తూ టీవీల్లో యాడ్స్‌ ఇస్తోంది.. డీహెచ్‌ఎస్‌ అధికారుల వార్నింగ్‌ సందేశాన్ని రేడియోలు, టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో విరివిగా ప్రసారం చేస్తోంది.

 

అమెరికా లోని వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని చేరుకునేలా సోషల్‌ మీడియాతో పాటు టెక్ట్స్‌ మెసెజ్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చారు అమెరికా అధికారులు.. చట్ట విరుద్ధంగా అమెరికాలో ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని వీడియోలో పేర్కొన్నారు.

 

అక్రమ వలసదారులు ఎవరికి వారు తామంతట తాముగా అమెరికా అధికారులను సంప్రదిస్తే.. స్వస్థలాలకు పంపేందుకు సురక్షితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలా కాకుండా తమ సెక్యూరిటీ బృందాలు పట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

సెక్యూరిటీ అధికారులకు పట్టుబడ్డ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరిస్తుందని, ఎప్పటికీ అమెరికా రాలేరని తెలిపారు. కానీ.. ఇప్పుడు వెళ్లిపోతే ఎప్పుడైనా అమెరికా వచ్చేందుకు, చట్టబద్ధంగా వచ్చి అమెరికాలో జీవించేందుకు అవకాశాలు ఉంటాయని వీడియో సందేశం ద్వారా ప్రచారం చేస్తున్నారు.

 

అంతే కాదు.. అమెరికాలో చట్ట విరుద్ధంగా ప్రవేశించడం ద్వారా నేరస్తులైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని, జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టారీతిన అక్రమంగా అమెరికా లోకి ప్రవేశించి తమ చట్టాలను ఉల్లంఘించే వారిని ఖచ్చితంగా వేటాడుతామని.. నేరస్థులకు అమెరికాలో స్థానం లేదని స్పష్టం చేశారు.

 

అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న ఎవరైనా అధికారుల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలని హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు..

Editor